Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
ఉదయం స్కూల్‌కు వచ్చిన ఒక విద్యార్థిని తరగతి గదిలో కుప్పకూలి మరణించింది. అయితే తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె తల్లి తెలిపింది. తీవ్ర చలి వల్ల శరీరంలోని రక్తం గడ్డకట్టంతో తన కుమార్తె చనిపోయినట్లు ఆమె ఆరోపించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ సంఘటన జరిగింది. శీతాకాలం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో 8 డిగ్రీల సెల్సియస్ దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా, 14 ఏళ్ల రియా సాగర్, రాజ్‌కోట్‌లోని గొండాల్ రోడ్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆ బాలిక స్కూల్‌కు వెళ్లింది. ప్రేయర్ తర్వాత క్లాస్ రూమ్‌కు వెళ్లిన ఆ విద్యార్థిని ఉదయం 7.23 గంటలకు కుప్పకూలింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని రియా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు విద్యార్థిని తల్లి జానకి బుధవారం మీడియాతో మాట్లాడింది. తీవ్రమైన చలి కారణంగానే తన కుమార్తె చనిపోయినట్లు ఆరోపించింది. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె చెప్పింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది. రియాకు గుండెపోటు రాలేదని, కేవలం తీవ్రమైన చలి వల్ల రక్తం గడ్డకట్టడంతో మరణించినట్లు చెప్పింది. అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు.