Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఆచరణలో కొందరు పోలీసుల తీరు దురుసుగానే ఉంటోంది. కర్నూలు జిల్లా ఆదోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో వాహన చోదకుల నుంచి ఈ-చలానా వసూళ్లు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపట్ల ఇద్దరు కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆదోని షరాఫ్ బజారు కూడలివద్ద ఈ నెల 18న కొందరు కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనాలకు పెండింగ్లో ఉన్న ఈ-చలానా వసూళ్లు చేపట్టారు. కూడలిలో దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ ఆపారు. అపరాధ రుసుం బకాయి ఉందని, చెల్లించాలని పోలీసులు తెలిపారు. తనవద్ద డబ్బులు లేవని చెప్పడంతో పోలీసులు, వాహన చోదకుడి మధ్య కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఇద్దరు కానిస్టేబుళ్లు దంపతులపట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాహన చోదకుడిని మెడపట్టి లాక్కెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.