Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ సభ విఫలం అయిందంటున్న ప్రతిపక్ష నాయకులపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఫ్లాప్ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించడం సరికాదని అన్నారు. ఖమ్మం సభ సూపర్ డూపర్ హిట్ అయిందని, వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్నారు. 24 గంటలు కరెంటు వస్తుందో లేదో తెలుసుకునేందుకు సంజయ్ ఏదో ఒక సమయంలో కరెంటు తీగలు పట్టుకొని చెక్ చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం సభ విఫలం అయిందంటున్న వారికి తమ కంటి వెలుగు పథకంలో భాగంగా కళ్లద్దాలు ఇస్తామన్నారు. వాటిని పెట్టుకుని చూస్తేనైనా నిజాలు కనబడతాయని పువ్వాడ విమర్శించారు. విద్యుత్తు రంగాన్ని, పంపిణీ సంస్థలను గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. సంస్కరణల పేరుతో అన్నదాతలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, ఈ కుట్రల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ ఉద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.