Authorization
Sat May 17, 2025 12:18:48 am
నవతెలంగాణ - హైదరాబాద్
వాయవ్య డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో రాత్రిపూట వస్తువులు, జంతువులతో ఓవర్‌లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోవడంతో కనీసం 145 మంది ప్రయాణికులు చనిపోయారని అధికారులు గురువారం తెలిపారు. ఈ విపత్తు నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మొత్తం 200 మందితో ఈ పడవ పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా మంగళవారం అర్థరాత్రి బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో పడవ బోల్తా పడింది.
కనీసం 145 మంది తప్పిపోయారని ఆ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల అధ్యక్షుడు జీన్-పియరీ వాంగేలా విలేకరులతో అన్నారు. పడవ మునిగిపోవడానికి ఓవర్‌లోడ్ కారణమని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ ప్రావిన్స్‌లో, ఇక్కడ బసంకుసు భూభాగంలో ఇతర రవాణా మార్గాలు లేవని ఆయన వెల్లడించారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్‌సీ)లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు అన్నారు.