Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సోషల్‌మీడియాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి రెండు, మూడురోజుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అవకాశం లేదని, ఆగమశాస్త్రాల ప్రకారం నిషేధించబడ్డాయన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసినట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో డ్రోన్ ద్వారా చిత్రీకరించారా లేక పాత ఫొటోలతో మార్ఫింగ్ చేసి త్రీడీ విధానంలోకి మార్చి భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు