Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వినోద్ తోమర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిబ్భూషణ్కు అత్యంత సన్నిహితుడు. సమాఖ్య వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వినోద్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా ఆందోళనకు దిగారు. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ధర్నా రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఈ క్రమంలో శనివారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించడానికి రెజ్లరు అంగీకరించారు. సమస్యపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ, సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శిని తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు తెలపడంతో ఒక పరిష్కారం లభించినైట్టెంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, రవి దహియా లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు క్రీడాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసింది.