Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
శనివారం అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ ఏటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ జాతర వారం రోజుల పాటు సాగనుంది. ఈ తరుణంలో జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్‌తో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ కు బయలుదేరుతారు.
ఆ తర్వాత స్థానిక గిరిజనులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం జాతర సమీపంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు సహా మొత్తం 450 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.