Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముంబయిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇకపై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుల కాపీలు ప్రాంతీయ భాషల్లోనూ లభ్యమవుతాయని వెల్లడించారు.
హిందీ సహా అన్ని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రతులు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. ఇందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడు తనకు అర్థమయ్యే భాషలో కోర్టు తీర్పుల సమాచారాన్ని పొందగలిగినప్పుడే న్యాయవ్యవస్థకు సార్థకత అని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో చివరి వ్యక్తికి కూడా న్యాయపరమైన సేవలు త్వరితగతిన అందేలా చూస్తామని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా (బీసీఎంజీ) ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ వినియోగం ద్వారా కోర్టుల్లో భారీస్థాయిలో మార్పులు తీసుకురావొచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.