Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటం సహజం. పోలీసులు, నిఘా వ్యవస్థలు ఉన్నా నగదు, మద్యం వంటివి పంపిణీ చేసే సందర్భాలు చూస్తూనే ఉంటాం. అయితే, కర్ణాటకలో ఓ బీజేపీ నేత, మాజీ మంత్రి మాత్రం నగదు పంపిణీపై బహిరంగంగా వ్యాఖ్యానించి వివాదానికి తెరతీశాడు. ప్రత్యర్థి పార్టీలు ఓటుకు రూ.3000 ఇస్తే తాము రూ.6000 ఇస్తామని ప్రకటన చేయడంతో.. అక్కడున్నవారితోపాటు పార్టీ నేతలు కూడా కంగుతిన్నారు.
నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఓటర్లకు బహుమతులు పంచుతున్నారు. ఇప్పటివరకు కుక్కర్ వంటి వంటింటి వస్తువులు పంచారు. మరిన్ని బహుమతులు పంచొచ్చు. వాటి విలువ మొత్తం కలిపి సుమారు రూ.3 వేలు ఉండొచ్చు. మా అభ్యర్థి రూ.6 వేలు ఇవ్వకుంటే మాకు ఓటెయ్యొద్దని అభ్యర్థిస్తున్నా అని అక్కడి ప్రత్యర్థి నేత(కాంగ్రెస్)ను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేత రమేష్ జర్కిహోళి పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల గడువుంది. దీంతో అక్కడి పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో బెళగావిలోని సులేబావిలో బీజేపీ నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి ఈ మేరకు వ్యాఖ్యానించారు. అయితే, వీటిని ఖండించిన బీజేపీ.. ఇది తమ పార్టీ ప్రకటన కాదని, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలంటూ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్.. లైంగిక కుంభకోణం కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో 2021లో రాజీనామా చేయడం గమనార్హం.