Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని గత రెండు రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శనివారం రాత్రి కర్ణాటక లోని బళ్లారిలో మంగ్లీ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈవెంట్ అనంతరం మంగ్లీ వెళ్తున్న కారుపై దాడి జరిగిందని పలు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. తనపై దాడి జరిగిందన్న వార్తల్లో నిజం లేదని.. అది ఫేక్ న్యూస్ అని మంగ్లీ కొట్టిపారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్‌ను రిలీజ్ చేసింది.
నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. శనివారం బళ్లారిలో జరిగిన కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగిందో ఫొటోలు, వీడియోలను చూస్తేనే అర్ధమవుతోంది. కన్నడ ప్రజలను నాపై చూపించిన ప్రేమ అపారమైనది. ఈవెంట్లో నన్ను బాగా చూసుకున్నారు. ఇది మాటల్లో వర్ణించలేనిది. ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ నోట్లో రాసుకొచ్చింది.