Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందుకు సన్నాహాలు చేపట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ వారం లేఆఫ్స్‌పై ప్రకటన చేయనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. స్పాటిఫైలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారనే వివరాలు ఇంకా వెలుగుచూడలేదు. లేఆఫ్స్‌పై స్పాటిఫై పెదవివిప్పకపోయినా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయవచ్చని చెబుతున్నారు. ఈ వారంలోనే స్పాటిఫై లేఆఫ్స్ బాంబు పేల్చనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్‌తో లేఆఫ్స్ సమాచారం అందించగా ఇతర దేశాల్లోని బాధిత ఉద్యోగులకూ లేఆఫ్స్‌పై సమాచారం చేరవేస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం మాస్ లేఆఫ్స్‌ను ప్రకటించాయి. కంపెనీలు భారీగా కొలువుల కోతకు దిగుతుండటంతో ఉద్యోగ భద్రతపై టెకీల్లో గుబులు రేగుతోంది.