Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ సీఎం జగన్ నేడు రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఉన్న రోడ్లను పూర్తిగా బాగుచేయాలని స్పష్టం చేశారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నాణ్యతపై దృష్టిపెట్టినప్పుడే సమస్యలు రావని అన్నారు. ముఖ్యంగా, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రధాన రోడ్లన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
రోడ్లు కుంగిపోయే ప్రదేశాలను గుర్తించి, అలాంటి చోట్ల ఎఫ్ డీఆర్ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. మొదటి దశలో ఎఫ్ డీఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో 1000 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెనలను కూడా పూర్తిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని తెలిపారు.