Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పులివెందులలో ఆయన అందుబాటులో లేకపోవడంతో అవినాష్ పీఏ రాఘవరెడ్డికి ఈ నోటీసు అందించింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి నోటీసులివ్వడం ఇదే తొలిసారి. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. సోమవారం ఉదయం పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి అక్కడ లేకపోవడంతో స్థానిక వైకాపా కార్యాలయానికి వెళ్లి అడిగారు. ఆయన అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కానీ భాస్కర్‌రెడ్డి అక్కడికి రాలేదంటూ పార్టీ కార్యకర్తలు చెప్పడంతో దాదాపు అరగంటపాటు అక్కడే వేచి చూశారు. కాసేపటికి అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి వచ్చి సీబీఐ అధికారులతో మాట్లాడారు. తన సెల్‌ఫోన్ నుంచి ఎవరికో కాల్ చేసి వారికి ఇచ్చారు. ఆ కాల్లో మాట్లాడిన అధికారులు కొన్ని వివరాలను సేకరించారు. అనంతరం అవినాష్‌రెడ్డికి జారీ చేసిన నోటీసులను రాఘవరెడ్డికి అందజేసి వెళ్లిపోయారు. భాస్కర్‌రెడ్డి గురించి ఆరా తీయటం, అవినాష్‌రెడ్డికి నోటీసులివ్వటం సంచలనంగా మారింది.