Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు గెలుచుకుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మావెరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ఈ జక్కన్న అద్భుతం అవార్డును కైవసం చేసుకుంది. ఇక గతేడాది జపాన్‌లో విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై మూడు నెలలు దాటినా జపాన్ ప్రజలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. అక్కడ ఈ చిత్రాన్ని 4 లక్షల మందికిపైగా వీక్షించారు.
ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉంది. మొత్తం పది భారతీయ చిత్రాలు ఈ బరిలో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. ఏ చిత్రాలు నామినేషన్ దక్కించుకుంటాయోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ కచ్చితంగా ఆస్కార్‌లో చోటుదక్కించుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.