Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దౌండ్ తాలూకాలోని పర్గావ్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. పుణె దౌండ్ తాలూకా పర్గావ్లోని భీమా నది ఒడ్డున నలుగురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు దౌండ్ క్యాంపస్లో మరో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. మృతులను మోహన్ ఉత్తమ్ పవార్, సంగీతా మోహన్ పవార్, శ్యాంరావ్ పండిట్ ఫుల్వారే, రాణి శ్యాంరావ్ ఫుల్వారే, రితేష్ శ్యాంరావ్ ఫుల్వారే, ఛోటూ ఫుల్వారే, కృష్ణగా గుర్తించారు. ప్రస్తుతం పూణె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.వీరి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే, హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కుటుంబం మతి వాడర్ వర్గానికి చెందిన సంచార కుటుంబం.