Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాపునాడు తాజాగా ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని బాలయ్యను డిమాండ్ చేశాయి. ఒకవేళ బాలకృష్ణ గనుక క్షమాపణలు చెప్పని తరుణంలో.. రంగా విగ్రహాల వద్ద మౌన ప్రదర్శన పాటించి నిరసన తెలపాలని కాపు సోదరులకు కాపునాడు పిలుపు ఇచ్చింది. నిర్ణీత సమయంలోపు బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలి. గతంలో దేవీబ్రహ్మణులపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య.. సంతకం లేని లేఖ రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అలాకాకుండా ప్రెస్మీట్ పెట్టి మరీ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది. అలా జరగని పక్షంలో.. టీడీపీ నుంచి బాలకృష్ణను పదేళ్ల పాటు బహిష్కరించాలి. ఇవేవీ జరగకుంటే నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ 'ఆ రంగా రావు.. ఈ రంగా రావు' అని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది.