Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తుది దశకు చేరుకున్న తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం పరిశీలించారు. మధ్యాహ్నం ప్రగతి భవన్ నుంచి కొత్త సెక్రటేరియట్‌కు వెళ్లిన కేసీఆర్.. దాదాపు 2 గంటలకు పైగా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లకు, వర్క్ ఏజెన్సీలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. సచివాలయంలోని అన్ని గదులను పరిశీలిస్తూ కలియతిరిగారు కేసీఆర్. సచివాలయంలోని సౌకర్యాలను, తదితర వివరాలను కేసీఆర్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు. తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంట్ తదితర నాణ్యతా అంశాలపై సీఎం ఆరా తీశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను సీఎం పరిశీలించారు. పార్కింగ్ ఏరియాను కూడా కేసీఆర్ సందర్శించారు. సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. ప్రీమియం మార్బుల్, స్టోనింగ్, వుడ్ వర్కులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. గ్రానైట్, మార్బుల్ ఫ్లోరింగ్, లిఫ్టుల పనుల తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్, సివరేజ్, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్, ఎలక్ట్రికల్ వర్క్, ఫ్లోర్ పనులపై ఇంజినీర్లు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన విషయం విదితమే. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.