Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం త్రిపురలోని జియానియా ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓటమి అనివార్యమేనని.. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీని ఓడించేందుకు ఓటర్లు తమ తమ ప్రజాస్వామిక హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. గత ఐదేళ్ల పాలనలో బీజేపీ ప్రతిపక్షాలను సమావేశాలు సైతం పెట్టించుకొనేందుకు అనుమతించలేదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు మాత్రమే చరిత్ర సృష్టిస్తారని మాణిక్ వ్యాఖ్యానించారు. గత 58 నెలల పాలనలో అరాచకత్వంతో వ్యవహరించిన బీజేపీ ఈసారి త్రిపురలో అధికారంలోకి రాదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి చర్యల్ని అవలంబిస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారన్నారు. కానీ బీజేపీ పాలనా వైఫల్యాలకు గాను ఆ పార్టీని ఓడించాలని డిసైడ్ అయ్యారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మైనార్టీలు, గిరిజనులు, అన్నివర్గాల ప్రజలు నినదిస్తున్నారని మాణిక్ సర్కార్ వ్యాఖ్యానించారు. జిరానియా సబ్డివిజన్లో సీపీఐ(ఎం) సంస్థాగత కార్యక్రమాలను రహస్యంగా నిర్వహించుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడ బీజేపీ శ్రేణులు సీపీఐ(ఎం) పని ఇక అయిపోయిందని భావించాయనీ.. కానీ ఈరోజు జరిగిన సమావేశం వారి అంచనా తప్పని రుజువు చేసిందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు మాత్రమే చరిత్ర సృష్టిస్తారని మాజీ సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను హైజాక్ చేసినందుకు బీజేపీ ప్రభుత్వాన్ని పారద్రోలాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌధురి పిలుపునిచ్చారు. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.