Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువజేసే 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. భద్రాచలం నుంచి హైదరాబాద్కు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న దుండిగల్, శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా సోమవారం దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ -5, సర్వీసు రోడ్డులో మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని రోటరీ-1 సమీపంలో నిఘాపెట్టారు. అటుగా వచ్చిన మారుతీ ఎస్ఎక్స్-4 వాహనాన్ని ఆపి అందులో ప్రయాణిస్తున్న లూనావత్ నగేశ్(30), నునావత్ వెంకటేశ్(24)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వెనుక వస్తున్న హోండా సిటీ కారులో గంజాయిని తరలిస్తున్నామని, తాము ఎస్కార్ట్గా ముందు వెళ్తున్నామంటూ వారు చెప్పారు. పది నిముషాల వ్యవధిలో వచ్చిన హోండా సిటీ కారును ఆపి తనిఖీలు చేపట్టి.. రూ.30 లక్షల విలువజేసే 150 కిలోల గంజాయి (పౌడర్) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులైన బనోత్ చందర్ (32), గండు అజయ్(21)ని ప్రశ్నించగా.. మహారాష్ట్రలోని తుల్జాపూర్కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి గంజాయితోపాటు రెండు కార్లు, మొబైల్ ఫోన్లు, రూ.9వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో నూనావత్ వెంకటేశ్ డిగ్రీ చదువుతున్నాడు. బానోత్ చందర్, లూనావత్ నగేశ్, గండు అజయ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. బానోత్ చందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి కాగా, మిగతా ముగ్గురు సూర్యాపేట జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.