Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ముంబై
ఇంటి టెర్రస్ నుంచి ఈల వేయడం మహిళ పట్ల లైంగిక వేధింపు కాదని హైకోర్టు తెలిపింది. దంపతులు నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నివాసం ఉండే పొరుగింటికి చెందిన లక్ష్మణ్, యోగేష్, సవితా పాండవ్పై ఒక మహిళ, ఆమె భర్త కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగేష్ అనే వ్యక్తి తన హుందాతనాన్ని కించపరిచేలా ప్రవర్తించినట్లు ఆ మహిళ ఆరోపించింది. 2022 మార్చి 21 నుంచి 23 మధ్య ఇంటి టెర్రస్ నుంచి యోగేష్ ఈల వేయడంతోపాటు పలు శబ్ధాలు చేశాడని, బైక్ హారన్ చేశాడని ఆ మహిళ ఆరోపించింది.
తన రోజువారీ కార్యక్రమాలు రికార్డు చేసేలా సీసీటీవీ కెమేరాను ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది. మార్చి 24న యోగేష్, అతడి కుటుంబ సభ్యులు తనపై రాళ్లు విసరసగా తాను గాయపడినట్లు చెప్పింది. దీనిని ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని, కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆరోపించింది.
ఈ తరుణంలో కోర్టు ఆ మహిళ, ఆమె భర్త దురుద్దేశంతో నిందితులపై కుల దూషణ కింద కేసు నమోదు చేసినట్లు అభిప్రాయపడింది. ఆ మహిళ ఫిర్యాదుకు ముందే నిందిత కుటుంబం ఆమెపై ఫిర్యాదు చేసిన విషయాన్ని విస్మరించలేమని, అలాగే ఒక వ్యక్తి తన ఇంట్లో శబ్దాలు చేయడం, టెర్రస్ నుంచి ఈల వేయడం ఆ మహిళ పట్ల లైంగిక వేధింపుల ఉద్దేశంతోనే అని ఊహించలేమని తెలిపింది. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.