Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని చాక్నవాడి నాలా పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. ఈ నాలాను ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాక్నవాడి నాలాపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి గత నెలలో కుంగిపోయింది. వెంటనే మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ. 1.27 కోట్లను నూతన వంతెన నిర్మాణం కోసం మంజూరు చేశారు. ఇటీవల నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కాగా, బుధవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ తరుణంలో మంత్రి తలసాని మాట్లాడుతూ నగరంలోని అనేక నాలాలు ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయని, అవి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. వాటిని అభివృద్ధి చేసేందుకు కేటీఆర్ చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. చాక్నవాడి నాలా దారుస్సలాం నుండి ప్రారంభమై తోఫ్ ఖానా, బేగంబజార్, ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, గురుద్వారా మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ప్రవహించి మూసీ నదిలో కలుస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యుద్దప్రాతిపదికన వంతెన నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని వివరించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాల వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రజల్లో దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియాఉద్దిన్, సీఈ కిషన్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ నాయక్ తదితరులు ఉన్నారు.