Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన 26 జనవరి రోజు భారత పౌరులందరికీ పండుగ రోజని అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని, గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగివుండడమే భారత దేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం పరిఢవిల్లి, దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని గుర్తు చేశారు.