Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోడీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు. అంతే కాకుండా ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది.
ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు.