Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 30 క్షిపణులు ప్రయోగించింది. వీటిలో 15 క్షిపణులను కూల్చినట్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలై ఏడాది కావస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యాను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు పంపుతామని అమెరికా, జర్మనీ బుధవారం వెల్లడించాయి. ఈ పరిణామం నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున రష్యా క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యాలోని మర్మాన్స్క్ ఒబ్లాస్ట్ నుంచి నింగిలోకి ఎగిరిన ఆరు టీయూ 95 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని మౌళిక సముదాయాల లక్ష్యంగా దాడులు జరిపాయి. అలాగే డ్రోన్లతో కూడా రష్యా దాడులు చేసింది.
మరోవైపు రష్యా పంపిన మొత్తం 24 డ్రోన్లను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయని ఉక్రెయిన్ రక్షణ అధికారులు తెలిపారు. అలాగే రాజధాని కీవ్ వైపు దూసుకొచ్చిన క్షిపణుల్లో 15 క్షిపణులను కూల్చివేసినట్లు చెప్పారు. రష్యా ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా కూడా ఎలాంటి నష్టం జరుగలేదన్నారు.