Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ బాలసాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ
- అన్ని జిల్లాల్లో నిర్వహించాలి
- సుద్దాల అశోక్ తేజ
నవతెలంగాణ-హైదరాబాద్
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ బాలోత్సవాల ప్రత్యేకత అని ప్రముఖ బాలసాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ బాలోత్సవాలను శుక్రవారం వెంకటరమణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరం పిల్లలు పుస్తకాలకే పరిమితమైన పోటీ ప్రపంచంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు మానసిక ఉల్లాసం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.
ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఉత్తేజాన్ని అందిస్తాయని వెంకటరమణ అన్నారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు విధిగా జరపాలని కోరారు. అనంతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న పిల్లలను చూస్తుంటే మా చిన్నతనం గుర్తుకు వస్తుందని అన్నారు. ఈ బాలోత్సవాలను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా జిల్లా, మండల స్థాయికి విస్తరించాలని అన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, భారత్ విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి నేతల్ని, ఆ దిశగా విద్యార్థులు అన్ని విషయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత అనూహ్య రెడ్డి, విజ్ఞాన దర్శిని కన్వీనర్ టి. రమేష్, బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, భూపతి వెంకటేశ్వర్లు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయకుమార్, నాయకులు బుచ్చిరెడ్డి, సుజావతి,రమణారావు, ప్రొ అరిబండి ప్రసాదరావు, సాంబిరెడ్డి, శంకర్, కృష్ణ, పి.ఎన్.మూర్తి, విజయ్, అశోక్ రెడ్డి, లెనిన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.