Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఖమ్మంజిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో ఆహారం తిని సుమారు 40 మంది విద్యార్థి, విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతకు లోనయ్యారు. ఒకరి తరువాత ఒకరు అస్వస్థతకు గురికావడంతో.. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. అయితే సంక్రాంతి పండుగకు వెళ్లి తెచ్చకున్న తినుబండారాల వలనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారుతెలిపారు. కాగా. దీనిపై విద్యార్థులు నిన్న విద్యాలయంలో వండిన వంట తినడం వల్లనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యామని వాపోతున్నారు. నిన్న చికెన్ వండారని అది తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి రావడం, వాంతులు అవడం జరిగిందని స్టూడెంట్స్ తెలిపినట్లు సమచారం.
అస్వస్థతకు గురైన విద్యార్థులను.. విద్యాలయ డార్మిటరీలో చికిత్స అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలు కోలుకుంటున్నారని, ఎటువంటి హానీ లేదని చెబుతున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైనా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇంత జరుగుతున్నా మాకు సమచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని.. ఈఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు తెచ్చుకున్న తిను బండారాలు ఒక్కరు తింటే అందరు విద్యార్థులు అస్వస్థలకు ఎలా గురయ్యారో విద్యాలయ యాజమాన్యం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.