Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారాన్ని సహించని కుటుంబ సభ్యులు ఒక యువతిని హత్య చేశారు. మృతదేహాన్ని తగులబెట్టి అవశేషాలను కాలువలో పడేశారు. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు.
లింబగో పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి బీహెచ్ఎంఎస్ మూడో ఏడాది చదువుతున్నది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఆమె ప్రేమించింది. కాగా, కుటుంబ సభ్యులు ఆ యువతికి పెళ్లి సంబంధం చూశారు. ఒక వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు. అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు అతడితో ఆమె చెప్పింది.
దీంతో ఆ వ్యక్తితో పెళ్లి రద్దు అయ్యింది. ఈ సంఘటనపై యువతి కుటుంబ సభ్యులు చాలా అసంతృప్తి చెందారు. యువతి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యలు కలిసి ఈ నెల 22న రాత్రి వేళ ఆమెను పొలం వద్దకు తీసుకెళ్లారు. తాడుతో గొంతు నొక్కి హత్య చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేశారు. ఆపై అవశేషాలను కాలువలో పడేశారు. మరోవైపు యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు.