Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆస్పత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ఆ వెంటనే ప్రత్యేక అంబులెన్సులో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. రక్తపోటు సాధారణంగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్న నిన్న ఉదయం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిమానుల తాకిడికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత లక్ష్మీపురంలోని మసీదు వద్ద కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనను పక్కకు తీసుకెళ్లారు. పావుగంట తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుండెపోటు రావడంతో కిందపడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. విషయం తెలిసిన చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఆయన ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని వైద్యులు తెలిపారు. తొలి రోజు పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటల సమయంలో లోకేశ్ ఆసుపత్రి వద్దకు చేరుకుని తారకరత్నను పరామర్శించారు.