Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమ్ముకశ్మీర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు శుక్రవారం తాత్కాలికంగా బ్రేక్ పడింది. కశ్మీర్లోయకు ముఖద్వారమైన ఖాజీగుండ్ ప్రాంతంలో తీవ్రమైన భద్రతా లోపాలతో పాటు భారీ జనసమూహాన్ని నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించాల్సిన వచ్చిందని రాహుల్ సైతం వెల్లడించారు. ‘‘దురదృష్టవశాత్తు పోలీసుల భద్రతా ఏర్పాట్లు పూర్తిగా కుప్పకూలడంతో ఈరోజు నడకను రద్దు చేసుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. జనసమూహాన్ని అదుపు చేయాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. యాత్రకు భద్రత కల్పించడం జమ్ముకశ్మీర్ యంత్రాంగం బాధ్యత అని, యాత్రలో మిగిలిన రోజులకు తగిన భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీకుండ్ చేరుకున్న రాహుల్... షెడ్యూల్ ప్రకారం దక్షిణ కశ్మీర్లోని వెస్సూ వైపు యాత్ర సాగించారు. కానీ అదే సమయంలో భద్రతా వలయాన్ని పర్యవేక్షించాల్సిన జమ్ముకశ్మీర్ పోలీసులు మాయమైనట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.