Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్గొండ
పుట్టుకతోనే ఫ్లోరోసిస్ బారిన పడిన అంశాల స్వామి (32) శనివారం ఉదయం మృతిచెందాడు. ట్రై సైకిల్ పై నుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు. గత 32 ఏళ్లుగా ఫ్లోరోసిస్ సమస్యపై అలుపెరుగని పోరాటం చేశారు. ఎటూ కదల్లేని స్థితిలోనూ తనలాంటి బాధితుల కోసం గొంతు వినిపించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి. ఫ్లోరోసిస్కు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
ఈ తరుణంలో వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘‘స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ఆయన. ఎంతో మందికి ఆయన ప్రేరణ. స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని సంతాపం ప్రకటించారు. ట్విటర్ వేదికగా కేటీఆర్ తనతో ఫోటో షేర్ చేస్తూ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.