Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ మండల్ లెనిన్‌నగర్‌కు చెందిన తూర్పాటి చెన్నమ్మ కుమార్తె సరస్వతి(30)కి 13 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు. తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి సూచనతో.. నాటి నుంచి సరస్వతి లెనిన్‌నగర్‌లోనే ఉంటూ కూలీ పనులు చేయసాగింది. నలుగురు పిల్లలనూ ఓ వసతి గృహంలో చేర్పించి చదివిస్తుంది. కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పలో సాదుల మహేందర్(21) నివసిస్తున్నాడు. మూడేళ్ల నుంచి అతడితో సరస్వతి సహజీవనం సాగిస్తోంది. తల్లి చెన్నమ్మ, అన్న యాదగిరి వారించినా వినకుండా.. మహేందర్‌తో తన పెళ్లి అయ్యిందని చెప్పి అతడితోనే ఉండసాగింది. ఇటీవల మహేందర్, సరస్వతి మధ్య తరుచూ ఘర్షణ పడసాగారు. దీంతో లెనిన్‌నగర్‌లోని పుట్టింటికి ఆమె చేరుకుంది. వారం రోజుల క్రితం తిరిగి మహేందర్ వద్దకు వెళ్లింది. శనివారం తెల్లవారుజామున సరస్వతి, మహేందర్‌లు.. రాజీవ్‌గృహ కల్పలోని నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని బంధువుల ద్వారా తెలిసింది. దీంతో సరస్వతి కుటుంబీకులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ సరస్వతి మృతదేహం నేలపై పడి ఉండగా.. మహేందర్ ఉరి వేసుకొని కనిపించాడు. యాదగిరి ఫిర్యాదుతో పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.