Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ఇవాళ ఉదయం టీవీలో ప్రసంగిస్తూ ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.
అదేవిధంగా కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ ఆయిల్ ధరలను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచినట్లు ఇషాక్ దార్ తెలిపారు. మొత్తం నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తులను ధరలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ.262.80కు చేరింది. అదేవిధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కు పెరిగింది.
ఇక లీటర్ కిరోసిన్ ఆయిల్ ధర రూ.189.83కు, లీటర్ లైట్ డీజిల్ ధర రూ.187కు చేరింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్లో పోల్చితే పాకిస్థాన్ రూపీ 11 శాతం పతనమయ్యిందని, దాంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.