Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతానంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, అతన్ని ఇంతవరూ అరెస్టు చేయలేదు. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరించాడు. అతనిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినందున వెంటనే అరెస్టు చేయలేదని డీసీపీ (ఔటర్) హరేంద్ర సింగ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఢిల్లీ గేట్ దగ్గరున్న గురు నాన్ ఐ సెంటర్లో నర్సింగ్ ఆర్డర్లీగా ఆ వ్యక్తి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అతను మరో క్లినిక్‌లో చికిత్స పొందుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై, హరేంద్ర సింగ్‌ను సంప్రదించినప్పుడు, ఆస్పత్రి వర్గాలను కనుక్కొని వాస్తవాలు నిర్ధారించనున్నట్టు చెప్పారు. మతస్థిమితం లేని వ్యక్తిని, అందునా వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని కంటి ఆస్పత్రిలో నర్సులకు సహాయకుడిగా ఎలా తీసుకున్నారనేది తమకు ఇంకా తెలియదని చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను చంపుతానంటూ ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నట్టు ఆయన తెలిపారు.