Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జడ్చర్ల
అనుమతులు లేకుండా ఓ గుడిసెలో నిల్వ ఉంచిన పేలుడు సామగ్రిని మహబూబ్‌నగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించిన ఘటన మంగళవారం జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల సీఐ రమేశ్‌బా బు కథనం ప్రకారం.. పట్టణంలోని విజయనగర్‌కాలనీలో వడ్డె బాలయ్యకు చెందిన గుడిసెలో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో పాలమూరు టాస్క్‌ఫోర్స్ సీఐ రవికుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈక్రమంలో బాలయ్య తన కంప్రెషన్‌తో గుట్టలపై బండరాళ్లను పేల్చేందుకు వనపర్తి జిల్లా పెబ్బేర్‌కు చెందిన రాజేశ్ నుంచి పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తనిఖీలో పట్టుబడిన పేలుడు పదార్థాల (2,700 జిలెటిన్ స్టిక్స్, 2,500 డిటోనేటర్స్)ను స్వాధీనం చేసుకొని జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పేలుడు పదార్థాలు ఇండ్ల మధ్య నిల్వ చేయటంపై పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు దీనిపై దృష్టిసారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.