Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారని... ప్రజల ఆందోళనలను, వారి ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, అసమానతలు వంటివి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదని అన్నారు. కేంద్రానికి ఎవరిపై మక్కువ ఉందో, ఎవరిపై పట్టింపు లేదో ఈ బడ్జెట్ తో మరోసారి అర్థమయిందని చెప్పారు. పన్నుల ఉపశమనం కూడా తగినంత లేదని చిదంబరం అన్నారు. పరోక్ష పన్నులను కూడా తగ్గించలేదని విమర్శించారు. ఇంధనం, నిత్యావసరాలు, ఎరువుల ధరలు పెరగడంపై ప్రస్తావన లేదని చెప్పారు. దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని... పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం పెరుగుతోందని అన్నారు. దేశ జనాభాలోని ఒక శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమయిందని చెప్పారు. ఆర్థిక రాజధానులను, ఇతర నగరాలను పట్టించుకోకుండా అహ్మదాబాద్ కు ప్రాధాన్యతను ఇచ్చారని విమర్శించారు.