Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిండర్, హింజ్ వంటి ప్రముఖ డేటింగ్ యాప్స్ మాతృసంస్ధ మ్యాచ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. ఖర్చులకు కళ్లెం వేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో 8 శాతం మందిని సాగనంపేందుకు మ్యాచ్ గ్రూప్ సన్నద్ధమైందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఆర్ధిక సంవత్సరం తొలి క్వార్టర్లో అంచనాల కంటే రాబడి తక్కువగా ఉంటుందనే సంకేతాలతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని మ్యాచ్ గ్రూప్ నిర్ణయించింది. ఉద్యోగులు, మార్కెటింగ్, ఆఫీస్ స్పేస్‌పై ఖర్చును తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇక ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు రెవెన్యూ పడిపోవడంతో పలు టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఆరంభమైన మాస్ లేఆఫ్స్ కొత్త ఏడాదిలోనూ కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్, మెటా, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు సహా పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.