Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరులో విషాదం చోటుచేసుకున్నది. కాంక్రీట్ మిక్సర్ లారీ ఒకటి బ్యాలెన్స్ కోల్పోయి అటుగా వెళ్తున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తల్లీకూతురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం బెంగళూరులోని బన్నేరుఘట్ట వద్ద జరిగింది. కూతురును స్కూల్ వద్ద దింపేందుకు తల్లి కారులో వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. ట్రక్కు యజమానిని గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు. బళ్లారికి చెందిన సునీల్ కుమార్, గాయత్రి కుటుంబం బెంగళూరులో నివసిస్తున్నది. వీరి కుమార్తె, కుమారుడు స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. తండ్రే వీరిని నిత్యం స్కూల్ వద్ద దింపేవాడు. అయితే, ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో ఆ పనిని భార్య గాయత్రికి అప్పగించాడు. కుమారుడు తన తల్లి ఇంటికి వెళ్లడంతో.. కూతురు సమతతో గాయత్రి కారులో బయల్దేరింది. పాఠశాలకు చేరుతుండగా ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ లారీ అకస్మాత్తుగా వీరి కారుపై బోల్తా పడింది. కారులో ఉన్న తల్లీకూతురు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. వీరి మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో నాలుగు మొబైల్ క్రేన్ల సాయంతో వారిని బయటకు తీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం వారి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకుని సంఘటనాస్థలానికి వచ్చిన మృతురాలి భర్త సునీల్ కుమార్.. భార్య, కూతురు మృతదేహాలను చూసి బోరున విలపించారు. తమ 10 నెలల కొడుకును అత్త ఇంట్లో వదిలేయడం వల్ల బతికిపోయాడని సునీల్ చెప్పడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉనన లారీ యజమాని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.