Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేరళ : కారులో మంటలు చెలరేగాయి. దీంతో ముందు సీట్లలో ఉన్న దంపతులు సజీవ దహనమయ్యారు. వెనుక సీట్లలో ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుట్యాత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు కంటి పరీక్ష కోసం గురువారం కన్నూర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కారులో ప్రయాణించారు. అయితే ఆసుపత్రి సమీపంలో వారు ప్రయాణించిన కారులో మంటలు చెలరేగాయి. ముందు సీట్లలో కూర్చొన్న భార్యాభర్తలకు మంటలు అంటుకున్నాయి. కారు ముందు డోర్లు జామ్ కావడంతో అవి తెరుచుకోలేదు. గమనించిన స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కారు ముందు సీట్లలో ఉన్న దంపతులు హాహాకారాలు చేస్తూ మంటల్లో సజీవ దహనమై మరణించారు. కాగా, కారు వెనుక సీట్లలో ఉన్న ఒక చిన్నారితో సహా నలుగురు వెంటనే డోర్లు తెరుచుకుని మంటల నుంచి బయటపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన 26 ఏళ్ల మహిళ గర్భవతి అని పేర్కొన్నారు. కారుకు మంటలు వ్యాపించడంపై సాంకేతిక, ఆటోమొబైల్ నిపుణులతో దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.