Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ లో విశ్వభారతి యూనివర్సిటీ భూ వివాదం ముదురుతోంది. వర్సిటీ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలను నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ కు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అందించడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే మమతపై విశ్వభారతి యూనివర్సిటీ తీవ్ర విమర్శలు చేసింది. 'విశ్వభారతి.. ఓ సెంట్రల్ యూనివర్సిటీ. మీ ఆశీస్సులు లేకున్నా మేం మెరుగ్గా ఉన్నాం. ఎందుకంటే మేం ప్రధాన మంత్రి మార్గదర్శనంలో ఉన్నాం' అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనపై విశ్వ భారతి అధికార ప్రతినిధి మహువా బెనర్జీ సంతకం ఉంది. 'చెవులతో చూడటం ఆపేసి.. మెదడును ఉపయోగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అభిమాన శిష్యుడు (అనుబ్రత మోండల్).. ప్రస్తుతం జైలులో మగ్గుతున్నాడు' అని పేర్కొంది. వర్సిటీకి చెందిన కొంత భూమిని అమర్త్యసేన్ ఆక్రమించారంటూ విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ యాజమాన్యం అమర్త్యసేన్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ అవమానించడం సరికాదని హితవు పలికారు. 'అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా? విశ్వభారతిని కాషాయీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నా. విశ్వభారతి యాజమాన్యం సరైన పంథాలో నడవాలని కోరుకుంటున్నా' అని మమత అన్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ కౌంటర్ గా ప్రకటన విడుదల చేసింది.