Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్ సంస్థ చేసిన 'ఆర్థిక కుంభకోణం' ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశంపై జేపీసీ లేదంటే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ అంశంపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలు రోజువారీగా వెల్లడించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం పార్లమెంట్లో ప్రతిపక్షాలు అదానీ ఎంటర్ప్రైజెస్ అంశంపై చర్చించాలని నోటీసు ఇచ్చాయి. కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడులపై చర్చించేందుకు రూల్ 267 ప్రకారం ప్రతిపక్షాలు బిజినెస్ నోటీసులు ఇవ్వగా.. స్పీకర్ తిరస్కరణకు గురవుతున్నాయని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ముఖ్యమైన అంశాలను లేవనెత్తినప్పుడు చర్చకు సమయం దొరకదంటూ విమర్శలు గుప్పించారు. కొన్ని సంస్థలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని, అలాగే అప్పులు ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఎల్ఐసీలో కోట్లాది మంది పెట్టుబడులు పెడుతున్నారని, కొన్ని కంపెనీలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేస్తుందో తాము అర్థం చేసుకోలేకపోతున్నామన్నారు.