Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాపట్ల : గిరిజన పాఠశాలలో లైంగిక వేధింపులు, మత్తు పదార్థాల వినియోగం వంటి ఆరోపణలపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి ఎం.రామ్మోహనరెడ్డి తెలిపారు. పర్చూరులోని గిరిజన పాఠశాలపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ ఖాదర్‌వలి, ఇతర సిబ్బంది నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నారు. సొంత భవనం నుంచి అద్దె భవనంలోకి మార్చడానికి గతంలో పనిచేసిన అధికారులు అనుసరించిన విధానాలను ఉప కార్యదర్శి ఆరా తీశారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై వివరాలు అడిగారు. ఉపాధ్యాయుల మధ్య విభేదాలు, లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, అనధికారికంగా సిబ్బంది గైర్హాజరు అందుకు సంబంధించి తీసుకున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో అసౌకర్యాలను ఉప కార్యదర్శి స్వయంగా పరిశీలించారు. సొంత భవనంలో నుంచి జీవీఎం పాలిటెక్నిక్ కళాశాల భవనంలోకి ఎప్పుడు మార్చారు, అద్దె ఎంత చెల్లించారు, ఇటీవల తీసుకున్న అద్దె భవనం, అందులో సౌకర్యాలకు సంబంధించి ప్రిన్సిపల్ నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యాలయానికి సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు నుంచి వివరాలు తీసుకున్నామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని రామ్మోహనరెడ్డి తెలిపారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారులు దయాసాగర్, శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.