Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని దుండగుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి శుక్రవారం ఈమెయిల్ వచ్చింది. తాలిబన్ల నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాలతో ముంబైలో మారణహోమం సృష్టిస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రత పెంచాలని సూచించారు. ఈ సూచనలతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలుచోట్ల భద్రత పెంచడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయోధ్యకూ బెదిరింపులు..
అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో పేలుళ్లకు పాల్పడతామంటూ ఫోన్ కాల్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రామజన్మభూమి స్థలంలో భద్రతను పెంచింది. రామ్ కోట్ కు చెందిన మనోజ్ అనే వ్యక్తికి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మనోజ్ రామ్ కోట్ లోని రాంలల్లా సదన్ ఆలయంలో నివసిస్తుంటారు. గురువారం ఆయనకు ఆగంతుకుల నుంచి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసినట్లు మనోజ్ వివరించారు.