Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే కొలీజియం సిఫార్సులకు కేంద్రం త్వరలోనే క్లియరెన్స్ ఇవ్వనుందని ఏజీ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం ఈ సిఫార్సులకు కేంద్రానికి పంపింది. పెండింగ్లో ఉన్న కొలీజియం సిఫార్సుల తాజా పరిస్థితిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానమిస్తూ, జడ్జీల నియామకాలను ఆదివారం నాడు జారీ చేయనున్నట్టు ధర్మాసనానికి తెలిపారు.
న్యాయ నియామకాలపై కేంద్ర ఎలాంటి టైమ్-లైన్ పాటించడం లేదంటూ బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ''డిసెంబర్లో 5 పేర్లు ప్రతిపాదించాం. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం'' అని విచారణకు హాజరైన ఏజీని ఉద్దేశించి జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. ఆ పేర్లను క్లియర్ చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఏజీకి సూచించారు. ఎప్పుడు వారెంట్లు ఇష్యూ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఏజీ సమాధానమిస్తూ, ఆదివారంనాడు జారీ చేస్తారని తెలుస్తోందని, ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఇవి ఉన్నాయని, శుక్రవారం సాయంత్రానికి క్లియెరెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.
దీనిపై జస్టిల్ కౌల్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన ఐదుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయని అటార్జీ జనరల్ కోర్టుకు వివరించినందున గరిష్టంగా ఐదు రోజుల్లోగా నియామాకాలు జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఉత్తర్వుల్లో ఎన్ని రోజులనే దానిని రికార్డు చేయవద్దని, ఆదివారంనాటికి వారెంట్లు జారీ అవుతాయని అన్నారు. ఇది చాలా సీరియస్ అంశమని, నియామకాల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాల కారణంగా ధర్మాసనం ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పించవద్దని ఆయన జస్టిల్ కౌల్ స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేశారు.