Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బడ్జెట్లో రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.12,800 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. బడ్జెట్లో తెలంంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు మంచి స్పందన వస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయని, 60-70 కి.మీ ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుస్తుందని, వందే భారత్ రైలుకు భిన్నంగా ఇది ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. హై స్పీడ్ రైళ్లపై అధ్యయనం చేస్తున్నట్టు, కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామన్నారు. కేంద్రం చేయాల్సింది చేస్తుందని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అశ్విని వైష్ణవ్ కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు రాబోతున్నాయన్నారు.