Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మరణించిన సంఘటన మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి (46) వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు వెళ్తున్న సమయంలో ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడం వలన లారీ వెనుక ద్విచక్ర వాహనం పై ఉన్న లింగారెడ్డి లారీని ఢీకొనడంతో హెల్మెట్ ఉన్నా తలకు తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వ్యక్తిని కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించి లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ గాంధీ గౌడ్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ తరుణంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వస్తున్న లారీలను సడన్ గా ఆపడం వలన వెనుక వస్తున్న వాహనాలు తరచూ ప్రమాదాల కారణం అవుతున్నాయని, ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆర్టిఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆరోపించారు.