Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాట్నా వెళ్లేందుకు ఢిల్లీలో విమానమెక్కిన ఓ ప్రయాణికుడు ఉదయ్‌పూర్‌లో దిగాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?..
అఫ్సర్ హుస్సేన్ అనే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6ఈ-214 టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, అతడు పాట్నా వెళ్లాల్సిన విమానానికి బదులుగా జైపూర్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లాల్సిన విమానం 6ఈ-319 ఎక్కేశాడు. విమానం అక్కడ ల్యాండయ్యాక కానీ ఆ విషయాన్ని అతడు గ్రహించలేదు. ఉదయ్‌పూర్‌లో దిగాక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. నాలుక్కరుచుకున్న వారు అదే విమానంలో అతడిని ఢిల్లీకి, ఆపై తర్వాతి రోజున అక్కడి నుంచి పాట్నాకు తరలించారు. ప్రయాణికులను విమానం దగ్గరికి తీసుకెళ్లే షటిల్ బస్సుల్లో ఒకదానికి బదులుగా మరోటి ఎక్కడం వల్లే ఈ పొరపాటు జరిగినట్టు గుర్తించారు. మరోవైపు, ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైనల్ బోర్డింగ్‌కు ముందు రెండు పాయింట్ల వద్ద బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించింది. ఒక విమానానికి బదులుగా ప్రయాణికుడు మరో విమానంలో ఎక్కి కూర్చున్న గమనించకపోవడం ఏంటని నిలదీసింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది. కాగా, ఇండిగోలో ఇలాంటి ఘటన జరగడం 20 రోజుల్లో ఇది రెండోసారి. జనవరి 13న ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్లేందుకు విమానమెక్కిన ప్రయాణికుడు చివరికి నాగ్‌పూర్‌లో ల్యాండయ్యాడు.