Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాద దాడులతో తల్లడిల్లుతోంది. వరుసగా పేలుళ్లు జరుగుతుండటం మానవతావాదులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఆదివారం బలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో అనేకమంది గాయపడినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశం (ఎఫ్‌సీ మూసా చెక్‌పాయింట్) వద్ద ఆదివారం ఉదయం భారీ బాంబు పేలుడు సంభవించిందని పాక్ మీడియా తెలిపింది. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోను బలూచిస్థాన్ పోస్ట్ ట్వీట్ చేసింది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగ, ధూళి వ్యాపించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. పీఎస్ఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఈ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఇధి వర్కర్ జీషన్ అహ్మద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పోలీసులు, అత్యవసర సమయాల్లో సేవలందించే బృందాలు చేరుకున్నాయని, సంఘటన స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయని చెప్పారు.