Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్‌కతా
పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మార్గ్రామ్లో బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త న్యూటన్ షేక్ మరణించగా, ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ షేక్ గాయపడ్డాడు. క్షతగాత్రుని స్థానిక ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఇటు అధికార టీఎంసీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య రేపింది. కాంగ్రెస్ మద్దతుదారులే బాంబు దాడి జరిపారని మృతుడు న్యూటన్ షేక్ బంధువులు ఆదివారంనాడు ఆరోపించగా, మార్గ్రామ్లో కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత బలం అంతగా లేదని, తమ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడే అవకాశామనే లేదని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తోసిపుచ్చారు. దాడికి పాల్పడిన వారు, బాధితులు కూడా టీఎంసీకి చెందిన వారేనని ఆయన చెప్పారు.
కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లట్లు షేక్‌ను రాష్ట్ర మంత్రి ఫిర్హద్ హకీం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాుతూ, దాడి ఘటనపై విచారణ జరుపుతున్నామని అన్నారు. బీర్భూమ్ జిల్లా జార్ఖాండ్తో సరిహద్దులను పంచుకుంటున్నందున ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు చెప్పారు. అసలు బాంబుల తయారీలో వాడే పదార్ధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే దానిపై దర్యాప్తు జరపాల్సి ఉంటుందని తెలిపారు. టీఎంసీలో అంతర్గత పోరే ఈ దాడి ఘటనకు కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అలాంటి అంతర్గత పోరు ఏదీ టీఎంసీలో లేదన్నారు.