Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రతువాలోని మదర్సా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు మాత్రమే ఈ ఎన్నికలో పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పలు ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టీఎంసీకి చెందిన ఇరు వర్గాల వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఒకరికి బుల్లెట్ గాయమైనట్లు చెప్పారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.