Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రదేశాల్లో భారీ సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి. అలెప్పొ, లటాకియా, హమా, టార్టస్ ప్రాంతాల్లో సుమారు 237 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. టర్కీ కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న సిరియాలో తాజా భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది.దాదాపు రెండు వేల మంది గాయపడ్డారు.
రాత్రి పూట భూకంపం సంభవించడం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు భవనాలు నేలమట్టం అయ్యాయి. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లక్షల సంఖ్యలో శరణార్ధులు ఉన్న ప్రాంతంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలుత 7.8 తీవ్రతతో టర్కీలో భూకంపం నమోదు అయ్యింది. ఆ తర్వాత 15 నిమిషాలకు 6.7 తీవ్రతతో మరో ప్రకంపన నమోదు అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గత శతాబ్ధంలో నమోదు అయిన అత్యంత శక్తివంతమైన భూకంపం అని నిపుణులు పేర్కొన్నారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రజలు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయిప్ ఎర్డగోన్ తెలిపారు.